Find Articles

చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 30కి పైగా కీలక అంశాలపై చర్చ

చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 30కి పైగా కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. 30కి పైగా కీలక అజెండా అంశాలతో ఈ సమావేశం కొనసాగుతోంది.

ఈ భేటీలో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, కీలక ప్రభుత్వ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది. ముఖ్యంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సదస్సుకు సుమారు 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ManaTV Team