
అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహించిన ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) రెండో మహాసభల్లో ప్రముఖ నటుడు సుమన్ పాల్గొని సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న జ్ఞాపకాలను MANA TV ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ప్రవాస తెలుగు వారందరి మధ్య ఐక్యతను పెంపొందించాలనే సంకల్పంతో దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక రాత్రి సెల్లార్‌లో సమావేశమై ఈ అసోసియేషన్ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు.
తదనంతరం శ్రీనివాస్, ప్రదీప్ శామల నేతృత్వంలో మాటా అసోసియేషన్ ప్రారంభమైందని, అయితే కరోనా మహమ్మారి కారణంగా అనేక కార్యక్రమాలు, వేడుకలు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. తాము అప్పట్లో కలగన్న ఆలోచన ఈరోజు విజయవంతమైన సంస్థగా రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
ఈ కన్వెన్షన్‌లో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం, పరస్పర ప్రేమాభిమానాలతో కలిసి పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని సుమన్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వారందరూ కలిసికట్టుగా ఉండాలని, కష్టకాలాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం పెరిగితేనే సమాజం మరింత బలపడుతుందని పేర్కొంటూ, తెలుగు వారి ఐక్యతే మాటా సంస్థ ప్రధాన లక్ష్యమని సుమన్ స్పష్టం చేశారు.

