అమెరికాలోని బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యూత్ కన్వెన్షన్‌లో ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఆయన సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటా నిర్వాహకులకు, ప్రవాస తెలుగు సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా వేదికపై తెలుగు అభిమానులను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రేక్షకుల ప్రేమ, దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మురళీధర్ గౌడ్ భావోద్వేగంగా చెప్పారు. తనను ఆదరిస్తున్న అభిమానుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తానని తెలిపారు.
భారత్ నుంచి రెండు విమానాలు మారి అమెరికాకు వచ్చామని, ఇక్కడి తెలుగు ప్రేక్షకులను కలవకుండా వెళ్లిపోవడం సాధ్యం కాదని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం తన సినిమాల్లోని ప్రముఖ డైలాగ్స్‌ను స్టేజ్‌పైనే చెప్పి సభలో నవ్వులు పూయించారు. ఆయన చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీగా చప్పట్లు, హర్షధ్వానాలు వినిపించాయి. మూడు రోజుల పాటు వైభవంగా సాగిన ఆటా మహాసభల్లో సినీ, రాజకీయ, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొని ప్రవాస తెలుగు సమాజాన్ని ఉత్సాహపరిచారు. అందులో మురళీధర్ గౌడ్ ప్రసంగం, ఆయన వినోదభరితమైన డైలాగ్స్ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.