మహాత్మా గాంధీ ఆశయాలు, స్ఫూర్తితో ఎన్నారైలు తెలంగాణ గ్రామీణాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. సీఎం చేస్తున్న అభివృద్ధి కృషికి అండగా ప్రవాసులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సరఫరా, ఉపకారవేతనాలు అందజేయడంతోపాటు విస్తృత సేవా కార్యక్రమాల్లో ఎన్నారైలు చొరవ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు సందీప్ వంగల, నెమలి మాధవ, శ్రీనివాస్ రామసహాయం, గూడూరు రవీందర్ రెడ్డి, గీతా చౌదరితోపాటు కాలిఫోర్నియాలో స్థిరపడిన పలువురు ప్రముఖులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.