Find Articles

ఐడల్ 16 విజేతగా ఒడిశా గాయని జ్యోతిర్మయి నాయక్.. రూ.20 లక్షల బహుమతి కైవసం

ఐడల్ 16 విజేతగా ఒడిశా గాయని జ్యోతిర్మయి నాయక్.. రూ.20 లక్షల బహుమతి కైవసం

ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 16’ విజేతగా ఒడిశాకు చెందిన జ్యోతిర్మయి నాయక్ నిలిచారు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె అద్భుతమైన ప్రదర్శనతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకుల మనసులు గెలుచుకుని ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో పాటు రూ.20 లక్షల నగదు బహుమతిని కూడా అందుకున్నారు.

ఫైనల్ పోటీలో తనిష్క్ శుక్లా, అన్షికా చోంకర్, మన్‌రాజ్ వీర్ సింగ్, మైస్క్‌మ్ బోసు, సుహైల్ సూఫీలతో పోటీపడిన జ్యోతిర్మయి చివరకు విజేతగా నిలిచారు. దీంతో ఇండియన్ ఐడల్ చరిత్రలో ఒడిశా నుంచి టైటిల్ గెలుచుకున్న తొలి కంటెస్టెంట్‌గా ఆమె రికార్డు సృష్టించారు.

చిన్నప్పటి నుంచే సంగీత సాధన
రూర్కెలాలో జన్మించిన 25 ఏళ్ల జ్యోతిర్మయి నాయక్ ప్రస్తుతం భువనేశ్వర్‌కు చెందినవారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందకముందే ఒడిశా ప్రాంతీయ సంగీత పరిశ్రమలో గాయనిగా మంచి పేరు సంపాదించారు. ఆమె గాయని మాత్రమే కాకుండా శిక్షణ పొందిన మ్యూజిక్ థెరపిస్ట్ కూడా. సంగీతం ద్వారా మానసిక, భావోద్వేగ సమస్యలకు ఉపశమనం కల్పించే రంగంలోనూ ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది.

ఆమె తల్లిదండ్రులు చక్రధర్ నాయక్, గౌరీ నాయక్. సంగీతంపై ఆసక్తి ఉన్న తండ్రి ప్రోత్సాహంతో చిన్న వయసులోనే సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించారు. మూడో తరగతిలో ఉండగానే రూర్కెలాలో బుద్ధ ప్రసాద్ రావు వద్ద హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం భువనేశ్వర్‌లో గురువు బాలకృష్ణ భైరా వద్ద సాధన కొనసాగించగా, బాలీవుడ్ గానంలో గురు శారదా ప్రసన్న సాహు వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు.

విద్య, లక్ష్యాలు
జ్యోతిర్మయి భువనేశ్వర్‌లోని కీట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం చెన్నై స్కూల్ ఆఫ్ మ్యూజిక్ థెరపీ నుంచి మ్యూజిక్ థెరపీలో సర్టిఫికేషన్ పొందారు.
ఇండియన్ ఐడల్ విజయం అనంతరం మాట్లాడుతూ, ఈ గెలుపు తన జీవితంలోని ఒక కల నిజమైన క్షణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో బాలీవుడ్ నటి అలియా భట్, దీపికా పదుకొణె చిత్రాలకు ప్లేబ్యాక్ సింగర్‌గా పాటలు పాడాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

ManaTV Team