
శివ కార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్, అథర్వ, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రెమ్యునరేషన్ ఇంకా చెల్లించలేదని డైరెక్టర్ సుధా కొంగర హైకోర్టును ఆశ్రయించారు.
‘పరాశక్తి’ సినిమాని డాన్ పిక్చర్ బ్యానర్ పై రూపొందించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సుధా కొంగరకు రూ.15 కోట్ల పారితోషికం ఇచ్చేలా మాట్లాడుకున్నారట. జీఎస్టీ కలుపుకొని మొత్తం రూ.17.70 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. అయితే నిర్మాతలు ఇప్పటివరకూ రూ.9.31 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగతా రూ.8.39 కోట్లు ఇవ్వడం లేదని సుధా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బకాయిలు చెల్లించే వరకు ‘ఇదయం మురళి’ విడుదలను నిలిపివేయాలని కోరారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ‘పరాశక్తి’ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రిలీజ్‌ను జూలై 8 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. అదేవిధంగా ‘ఇదయమ్ మురళి’ సినిమాను నిలిపివేయాలనే సుధా కొంగర విజ్ఞప్తిపై జూలై 7 లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డాన్ పిక్చర్స్ యాజమాన్యానికి సూచించింది.

