Find Articles

భారతీయ మూలాలున్న వారు రాజకీయాల్లోకి రావాలి.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు పిలుపు

భారతీయ మూలాలున్న వారు రాజకీయాల్లోకి రావాలి.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు పిలుపు

అమెరికాలో భారతీయ మూలాలున్న వారు రాజకీయాల్లోకి రావాలంటూ యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కీలక పిలుపునిచ్చారు. ఇటీవల అగ్రరాజ్యంలోని పలు ప్రాంతాల్లో భారత్ కు వ్యతిరేకంగా విద్వేషపూరిత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సూచన చేశారు.

జాతి వివక్ష ఘటనలకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపించడానికి ఎన్నికల్లో పోటీ చేయాలని, ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించాలని రాజా కృష్ణమూర్తి ప్రవాస భారతీయులను కోరారు. ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ ఆధ్వర్యంలో క్యాపిటల్ హిల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.

అమెరికాలో విద్యావంతులు, సంపన్న వర్గాల్లో ఒకరిగా ఉన్నప్పటికీ, భారతీయ – అమెరికన్లు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని రాజా కృష్ణమూర్తి తెలిపారు. అమెరికన్లలో భారత, హిందూ వ్యతిరేక ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని స్థాయిల్లోనూ రాజకీయ పదవులకు పోటీ చేయాలని ప్రోత్సహించారు. మనం ఎదుర్కొనే సమస్యలపై గొంతు ఎత్తకపోతే బాధితులుగా ఉండిపోవాల్సి వస్తుందన్నారు. వలసదారులపై ద్వేషం పెరుగుతున్న క్రమంలో.. ప్రవాస భారతీయులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.

ManaTV Team