
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఒక నెటిజన్‌పై ప్రముఖ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి మండిపడ్డారు. బలవంతపు పెళ్లి కారణం చూపిస్తూ నేరపూరిత ప్రవర్తనను సమర్థించడం సరికాదన్నారు. ఎలాంటి వ్యక్తిగత పరిస్థితులు కానీ, సంస్కృతి కానీ ఇలాంటి దారుణాన్ని వెనకేసుకు రావడానికి కారణం కాలేవని స్పష్టం చేశారు.
సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి విదేశాల్లో ఉండి ఉంటే వారు సహజీవనం చేసేవారని, అప్పుడు కేతన్ అగర్వాల్ అనే వ్యక్తి వీరి మధ్యలోకి వచ్చేవాడే కాదని, బలవంతపు పెళ్లిళ్లు తప్పంటూ ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై స్పందించిన సుచిత్ర.. పెళ్లి ఇష్టం లేకపోతే సియాకు చట్టపరమైన, వ్యక్తిగత మార్గాలు చాలా ఉన్నాయని తెలిపారు. అంతేకానీ హింసకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ఇలాంటి నేరపూరిత ప్రవర్తనను వెనకేసుకొస్తున్న వారిని చూసి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేకపోతే ఇల్లు వదిలి వెళ్లిపోవచ్చు, లేదా కుటుంబంపై కేసు పెట్టి ఉండొచ్చు. కానీ ముందే ప్లాన్ చేసి, కాబోయే భర్తను కొండపై నుంచి నెట్టి చంపడం కచ్చితంగా సైకో మనస్తత్వమే అంటూ సుచిత్ర ఘాటుగా స్పందించారు.
1994లో షారూఖ్ ఖాన్ సరసన ‘కభీ హా కభీ నా’ చిత్రంలో అన్నా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుచిత్రా కృష్ణమూర్తి.. డోలే డోలే, దమ్ తారా వంటి పాప్ ఆల్బమ్స్ చేశారు. అంతేకాదు రచయితగా, పెయింటర్‌గానూ రాణిస్తున్నారు.

