
సోషల్ మీడియాలో రోజురోజుకు పెరుగుతున్న ద్వేషపూరిత వ్యాఖ్యలపై దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్’ వేదికను పూర్తిగా వీడుతున్నట్లు ప్రకటించారు.
ఇటీవల పూణెలో కేతన్ అగర్వాల్ హత్య చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది.ఈ నేపథ్యంలోనే రాహుల్‌ను ట్యాగ్ చేసిన ఓ నెటిజన్, మహిళల సమస్యలపై సినిమా తీసినట్లే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా తీస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రాహుల్ సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో రాహుల్ రవీంద్రన్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కొందరు వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, ఆయన కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. తన చిన్న పిల్లలను కూడా చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ‘ఎక్స్’ను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ రవీంద్రన్ తెలిపారు.చాలాకాలంగా ఆ వేదిక నుంచి బయటకు రావాలనుకున్నానని, కానీ క్రీడా వార్తల కోసం కొనసాగానని వివరించారు.

