Find Articles

ఏషియన్ గేమ్స్ ..ఒకే ఒక్క మార్పుతో భారత మహిళల క్రికెట్ జట్టు ప్రకటన

ఏషియన్ గేమ్స్ ..ఒకే ఒక్క మార్పుతో భారత మహిళల క్రికెట్ జట్టు ప్రకటన

రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది. ఈ టీమ్ ను కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ముందుండి నడిపించనున్నారు. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న టీమ్ పై సెలక్షన్ కమిటీ పూర్తి నమ్మకంగా ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ లో ఒకే ఒక్క మార్పు చేసింది. వికెట్ కీపర్ యస్తికా భాటియా స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్, వికెట్ కీపర్ అయిన జి. కమలినికి జట్టులో అవకాశం కల్పించింది. మిగతా టీమ్ యథాతథంగా కొనసాగుతుండగా.. ఇది జట్టు కూర్పులో స్థిరత్వాన్ని సూచిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించనున్నారు. వికెట్ కీపింగ్ బాధ్యతలను రిచా ఘోష్ ప్రధానంగా మోయనుండగా, ఆమెకు బ్యాకప్‌గా కమలిని ఎంపికైంది. అలాగే స్టార్ ఆల్-రౌండర్ దీప్తి శర్మ మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూర్చనుంది.

ఇక స్పిన్ విభాగంలో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ రాధా యాదవ్, ఆఫ్-స్పిన్నర్ శ్రేయాంక పాటిల్, యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తెలుగ‌మ్మాయి శ్రీ చరణి ఉన్నారు. పేస్ బౌలింగ్ విభాగానికి స్వింగ్ స్పెషలిస్ట్ రేణుకా సింగ్ ఠాకూర్, అనుభవజ్ఞురాలైన అరుంధతి రెడ్డి నాయకత్వం వహించనున్నారు. అయితే, యువ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ ఎంపిక ఆమె ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో చీలమండ గాయం కారణంగా ఆమె టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది.

  • భారత మహిళల జట్టు:
    హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జి. కమలిని (వికెట్ కీపర్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, నందిని శర్మ, శ్రేయాంక పాటిల్.

ManaTV Team