
ప్రముఖ నటి సమంత జీవితంలో మరో మధుర ఘట్టం చోటుచేసుకుంది. త్వరలో తల్లిగా మారనున్న ఆమెకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన సమంత ఆనందోత్సాహాల మధ్య వేడుకలో పాల్గొనగా, ఆమెకు కుటుంబ సభ్యులు ఆశీర్వాదాలు అందించారు.
సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు తమ తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 చివరిలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఈ ఏడాది డిసెంబర్‌లో తొలి సంతానం జన్మించనున్నట్లు సమాచారం. సీమంతం వేడుకను కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించగా, సమంత తన అత్తగారితో పంచుకున్న ఆప్యాయ క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
గత జూన్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె గర్భవతి అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం చిత్ర దర్శకుడు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అప్పటి నుంచి గర్భధారణకు సంబంధించిన పలు విశేషాలను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
