
తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ మరోసారి చర్చకు దారితీసింది. నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీతో విజయవంతం కావడంతో ఇతర స్టార్ హీరోల రాజకీయ ప్రవేశంపై కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా స్టార్ హీరో సూర్య త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారంటూ వచ్చిన వార్తలు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
సూర్య ఎన్నో ఏళ్లుగా ‘అగరం ఫౌండేషన్’ ద్వారా విద్యార్థులకు, పేదలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయం తెలిసిందే. ఆయన అభిమాన సంఘాలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ‘సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం’ సమావేశంలో సంఘ ప్రతినిధి ఆర్. వీరమణి భవిష్యత్తులో సూర్య రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీంతో కొన్ని తమిళ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించగా.. సూర్య రాజకీయ అరంగేట్రం వార్త వైరల్ గా మారింది. విజయ్ తరహాలోనే సూర్య కూడా ప్రజాసేవ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారని అభిమానులు భావించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సూర్య టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. సూర్యకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పింది. అభిమాన సంఘం సమావేశంలో వీరమణి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, వాటితో సూర్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సూర్య నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొంది. సమాజానికి మేలు చేయాలనే స్వచ్ఛమైన ఆశయంతోనే ‘అగరం ఫౌండేషన్’ ద్వారా విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయం చేస్తున్నారని వివరించింది. మొత్తంగా ఈ ప్రకటనతో సూర్య రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.

