
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మీడియా సమావేశాలను పరిమితం చేయాలనే తమ నిరసనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ ప్రకటించారు.ఈ మేరకు నిర్వాహకులతో జరిపిన చర్చలు ఫలించాయని తెలిపారు. దీంతో టోర్నమెంట్ మీడియా కార్యకలాపాలు యథాతథంగా కొనసాగనున్నాయి.
గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ వాటా, ఆటగాళ్ల సంక్షేమానికి మరిన్ని నిధులు, టోర్నీల పాలనలో కమిటీ ఏర్పాటు వంటి పలు డిమాండ్లతో 2025 నుంచి ప్లేయర్స్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వింబుల్డన్ ఫస్ట్ వీక్ లో మీడియా సమావేశాలను కేవలం 15 నిమిషాలకే పరిమితం చేయాలని మొదట నిర్ణయించారు.కానీ, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.అయితే, అసలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని చెప్పారు. నిర్వాహకుల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు, ఆటగాళ్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ఆల్ ఇంగ్లండ్ క్లబ్.. ప్రైజ్ మనీ నమూనా, పాలనలో ప్రాతినిధ్యం వంటి అంశాలపై పక్కా ప్రణాళికలు రూపొందించడానికి అంగీకారం తెలిపిందని తెలుస్తోంది.మొత్తంగా ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినప్పటికీ, ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగనున్నాయి. కాగా, గ్రాస్ కోర్టుపై జరిగే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ లండన్ లో ప్రారంభమైంది.

