
యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘ఆల్ఫా’. లేడీ ఓరియంటెడ్ యాక్షన్ విజువల్ వండర్ గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ సరికొత్త యాక్షన్ అవతార్ లో కనిపించారు.
ప్రోమోలో అలియా తన 18వ బర్త్ డేను తండ్రి (బాబీ డియోల్) తో జరుపుకుంటున్నట్లు కనిపిస్తుంది. తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమ ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. కట్ చేస్తే.. ఆమె జీవితాంతం నేర్చుకున్న శిక్షణ కేవలం పెద్దయ్యాక బతకడానికి కాదని, తన 18వ పుట్టినరోజునే ఆమె ఫస్ట్ మిషన్ కు రెడీ కావడానికని బాబీ డియోల్ పాత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత అలియా భయంకరమైన పోరాట సన్నివేశాల్లో కనిపిస్తుంది. ‘ఆల్ఫా’గా మారడమే లక్ష్యంగా ఆమెకు శిక్షణ ఇచ్చినట్లు ఈ ప్రోమో స్పష్టం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రోమోలో బాబీ డియోల్ చెప్పిన డైలాగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. “ఈ ప్రపంచంలో తోడేళ్లు, గొర్రెలు మాత్రమే ఉంటాయి. తోడేలు కూతురు తోడేలే అవుతుంది” అని తన కూతురితో చెప్పడం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
యశ్‌రాజ్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో ఈ ప్రోమోను షేర్ చేస్తూ, “మొదటిది, వేగవంతమైనది, ధైర్యమైనది. #ALPHA” అని క్యాప్షన్ ను జోడించింది. ఈ చిత్రంలో శర్వరీ వాఘ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘గంగూబాయి’, ‘హైవే’ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న అలియా భట్, పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

