ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ ఏ విధంగానైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. కీవ్‌లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహాతో విస్తృత చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో కూడా జైశంకర్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, దాని ప్రభావాలు, శాంతి స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిగినట్లు తెలిపారు.
నల్ల సముద్రంలో నౌకలపై దాడులపై ఆందోళన
నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల అంశాన్ని భారత్ చర్చల్లో ప్రస్తావించినట్లు జైశంకర్ వెల్లడించారు. ఈ దాడుల్లో భారత నావికులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడటంతో పాటు ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతోందని జైశంకర్ పేర్కొన్నారు.