
ప్రముఖ యువ నటి ప్రియాంక అరుళ్ మోహన్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆమెను దక్షిణ కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా నియమిస్తున్నట్లు కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థ అధికారికంగా ప్రకటించాయి.
ఇటీవలే ప్రియాంక అరుళ్ మోహన్ ‘మేడ్ ఇన్ కొరియా’ అనే తమిళ చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ విశేష గౌరవం దక్కడం విశేషం.ఈ సినిమా కొరియా నేపథ్యంలో సాగడం, అక్కడి సంస్కృతిని ప్రతిబింబించడంతో ఆమెను ఈ పదవికి ఎంపిక చేశారు.ఈ అరుదైన క్షణాన్ని ప్రియాంక మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఇది నాకు దక్కిన అద్భుతమైన గౌరవం. కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా నన్ను నియమించడం ఎంతో ప్రత్యేకం. కొరియా సంస్కృతిని, సంప్రదాయాలను భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేసే వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు కొరియా ప్రభుత్వానికి, పర్యాటక సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు. కొరియా సంస్కృతి, ప్రజల ఆప్యాయత నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ అందమైన ప్రయాణంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను” అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
రా కార్తీక్ డైరెక్షన్ లో వచ్చిన ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నేరుగా ఓటీటీలో రిలీజైంది. దక్షిణ కొరియాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ ద్వారానే ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి అంతర్జాతీయ నటులతో కలిసి పని చేశారు. ఇప్పుడు అదే సినిమా ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకురావడం విశేషం.

