
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న శ్రద్ధ అనే ఎనిమిదేళ్ల చిన్నారి కోరికను ఆయన నెరవేర్చారు. చిన్నారితో అల్లు అర్జున్ జరిపిన వీడియో కాల్ సంభాషణకు సంబంధించిన విజువల్స్‌ను ఆయన పిఆర్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమా రంగానికి బయట కూడా నవ్వులు పూయించడమే తమ ఉద్దేశమని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల చివరి కోరికలను తీర్చే ‘మేక్-ఎ-విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ ప్రతినిధులు జూన్ 19న అల్లు అర్జున్ కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ చిన్నారితో వీడియో కాల్ మాట్లాడారు. శ్రద్ధను నవ్వుతూ పలకరిస్తూ.. తన ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని ఐకానిక్ డైలాగులను చెప్పమని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై ఒకేసారి ‘గడ్డం కింద చేయి తిప్పే’ మేనరిజంను చేశారు.. చిన్నారి చేసిన ఆ క్యూట్ యాక్షన్‌ను చూసి బన్నీ గట్టిగా చప్పట్లు కొడుతూ ‘డ్యామ్ క్యూట్’ అని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నావని అడగ్గా.. తాను డాక్టర్ అవుతానని ఆ చిన్నారి సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే శ్రద్ధ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బన్నీ ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కచ్చితంగా హైదరాబాద్ వచ్చి తనను కలవాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ‘రాకా’ అనే సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు జూన్ 22న అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. 2024లో ‘పుష్ప 2: ది రూల్’ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి ఆయన కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఓ వైపు ఈ కేసులో లీగల్ ప్రాసెస్ నడుస్తున్నప్పటికీ, తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారి ముఖంలో నవ్వులు పూయించడానికి ఆయన చూపించిన చొరవను నెటిజన్లు కొనియాడుతున్నారు.

