ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ, రాషా థడానీ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి ‘ఉక్కిరిబిక్కిరి’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. విడుదలైన కొద్ది సేపటికే ఈ పాట సోషల్ మీడియాలో మంచి స్పందనను దక్కించుకుంటూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీకి ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా, గాయకుడు హరిచరణ్ తన మధురమైన గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమను, భావోద్వేగాలను అందంగా ఆవిష్కరించేలా ఈ పాటను చిత్రీకరించారు.
అందమైన లొకేషన్లు, ఆకట్టుకునే విజువల్స్‌తో పాటు జయకృష్ణ, రాషా థడానీ మధ్య కనిపించిన కెమిస్ట్రీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. జీవీ ప్రకాశ్ అందించిన మెలోడీ ట్యూన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
చందమామ కథలు పిక్చర్స్ LLP బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత సి. అశ్విని దత్ సమర్పిస్తున్నారు. సినిమాలో మోహన్ బాబు, బ్రహ్మాజీ, నరేష్, కిక్ శ్యామ్, అజయ్, వాసుకి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాకు జయకృష్ణ సినిమాటోగ్రఫీ అందించగా, మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తిని పెంచగా, ఇప్పుడు విడుదలైన ‘ఉక్కిరిబిక్కిరి’ వీడియో సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.