హైదరాబాద్, సెప్టెంబర్ 30: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అభిమానులను కదిలించాయి. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ గురించి ఆయన చెప్పిన మాటలు అందరి మనసులను తాకాయి.
అక్టోబర్ 2న విడుదల కానున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ తన సినీ ప్రయాణంలోని కొన్ని వ్యక్తిగత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.
తన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ ప్రారంభోత్సవం 2000 నవంబర్‌లో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్న ఎన్టీఆర్, ఆ రోజు తాను ఎంతో ఒంటరితనాన్ని అనుభవించానని చెప్పారు. తన తల్లి బయటకు ఎక్కువగా రాకపోవడం, తండ్రి స్వతంత్రంగా ఎదగాలని భావించడం వల్ల ఆ కార్యక్రమానికి తాను ఒంటరిగానే వెళ్లానని తెలిపారు.
“ఆ రోజు నాకు చాలా భయం వేసింది. నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పే కుటుంబ సభ్యుడు ఎవరూ లేరనే బాధ కలిగింది. నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నానని అనిపించింది” అని ఎన్టీఆర్ భావోద్వేగంగా చెప్పారు.
అయితే కాలక్రమేణా తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని పేర్కొన్న ఆయన, అభిమానులే తనకు కుటుంబంగా మారారని అన్నారు. “దేవుడు నా బాధ విన్నట్టున్నాడు. నా అభిమానులను నాకు కుటుంబంగా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా అది సరిపోదనుకున్నాడో ఏమో.. రాజమౌళి కుటుంబాన్ని కూడా నాకు కుటుంబంగా ఇచ్చాడు” అని ఎన్టీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఎన్టీఆర్, కీరవాణి, వల్లి గారితో పాటు ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తనకు కుటుంబ సభ్యుల్లా మారారని చెప్పారు. ముఖ్యంగా ఎస్.ఎస్. కార్తికేయ గురించి మాట్లాడుతూ, “దేవుడు నాకు ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తిగా కార్తికేయను ఇచ్చాడు. ఆయన రక్తసంబంధం కాకపోయినా, ప్రతి సందర్భంలో నా వెంటే నిలిచాడు” అని అన్నారు.
ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సభలో ఘన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.