Find Articles

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ (57) కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. అలప్పుజాలో ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లిన సమయంలో షాజీ కుమార్‌కు శనివారం రాత్రి అకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో కన్నుమూశారు.

షాజీ కుమార్ తన కెరీర్‌లో 50కి పైగా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ముఖ్యంగా మోహన్‌లాల్ నటించిన ‘పులిమురుగన్’, ‘నరన్’, ‘ఒడియన్’, ‘తുടరుమ్’ వంటి విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించారు. మలయాళంతో పాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రముఖ దర్శకులు షాజీ కైలాస్, జోషి, వినయన్, వైశాఖ్ వంటి వారితో ఆయన పనిచేశారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ‘అతిమనోహరం’, ‘ఒట్టకొంబన్’ సినిమాలు కూడా ఆయన చివరి ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

షాజీ కుమార్ ఆకస్మిక మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటుగా మిగిలిపోనుంది.

ManaTV Team