Find Articles

ఆటా మహాసభల్లో అరుణా మిల్లర్ తెలుగు ప్రసంగం..

ఆటా మహాసభల్లో అరుణా మిల్లర్ తెలుగు ప్రసంగం..

అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభలకు మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ ముఖ్య అతిథిగా హాజరై తెలుగులో ప్రసంగించి సభికులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా మహాసభలకు హాజరైన ప్రముఖులు, దాతలు, కళాకారులు, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగు అతిథులందరికీ మేరీల్యాండ్ రాష్ట్రం తరఫున ఆమె హృదయపూర్వక స్వాగతం పలికారు. తెలుగు భాష, సంస్కృతిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఆటా సంస్థ సేవలను అభినందించారు.

ప్రసంగంలో మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్ నాయకత్వాన్ని అరుణా మిల్లర్ కొనియాడారు. ఆయన జీవిత ప్రయాణం, విద్యాభ్యాసం, అమెరికా సైన్యంలో చేసిన సేవలు, ప్రజా నాయకుడిగా సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, సమాజాభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
అలాగే 2022 ఎన్నికల సందర్భంగా తాము కలిసి పోటీ చేసిన అనుభవాలను గుర్తుచేసుకున్న ఆమె, మేరీల్యాండ్ రాష్ట్ర చరిత్రలో తొలి తెలుగు మూలాలు కలిగిన ఇమ్మిగ్రెంట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. అయితే చరిత్ర సృష్టించడమే లక్ష్యం కాదని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం, వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రజా ప్రతినిధుల అసలైన బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ మహాసభల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్న అరుణా మిల్లర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు ఆటా వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఆమె తెలుగు ప్రసంగానికి సభికుల నుంచి ఘన స్పందన లభించింది.

ManaTV Team