
క్రికెట్లో నోబాల్, వైడ్, స్లో ఓవర్‌రేట్ పెనాల్టీలు చూస్తుంటాం. కానీ ఎప్పుడైనా రన్స్ పెనాల్టీ చూశారా.? ఓ ప్లేయర్ చేసిన చిన్న పొరపాటు వల్ల టీమ్ కు ఏకంగా పది పరుగుల జరిమానా పడింది. తాజాగా శ్రీలంక ‘ఏ’తో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ లో భారత్ ‘ఏ’ జట్టుకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
యువ ఆల్ రౌండర్ విప్రాజ్ నిగమ్ చేసిన చిన్న తప్పిదం కారణంగా ప్రత్యర్థి టీమ్ ఇన్సింగ్స్ ను నేరుగా 10/0 స్కోరుతో ప్రారంభించింది.విప్రాజ్ నిగమ్ బ్యాటింగ్ చేసే సమయంలో మ్యాచ్ లో పిచ్ పై ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాలో రెండుసార్లు పరుగెత్తాడు.అంతకుముందే మరో భారత బ్యాటర్ అనుకుల్ రాయ్ ను ఇదే విషయంపై అంపైర్లు హెచ్చరించారు. ఆ తరువాత విప్రాజ్ నిగమ్ కూడా అదే మిస్టేక్ చేయడంతో అంపైర్లు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. అయితే 37వ ఓవర్ లోనూ పిచ్ మధ్యలోనే పరుగెత్తడంతో రెండోసారి కూడా ఐదు పరుగుల జరిమానా విధించారు. దీంతో మొత్తంగా పది పరుగులు శ్రీలంక ‘ఏ’ టీమ్ ఖాతాలో చేరాయి. ఫలితంగా వాళ్లు బ్యాటింగ్ ప్రారంభించే సమయానికి స్కోర్ బోర్డుపై 10/0 కనిపించింది.
ఎంసీసీ నిబంధనల ప్రకారం.. బ్యాటర్లు అవసరం లేకుండా లేదా ఉద్దేశపూర్వకంగా పిచ్‌లోని రక్షిత ప్రాంతాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదు. ఒకసారి హెచ్చరించిన తర్వాత అదే ఇన్నింగ్స్‌లో మళ్లీ తప్పు జరిగితే ఫీల్డింగ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు ఇవ్వొచ్చు. భారత్ ‘ఏ’ బ్యాటర్లు రెండుసార్లు అదే నిబంధనను ఉల్లంఘించడంతో మొత్తం 10 పరుగుల శిక్ష పడింది. ఈ అరుదైన ఘటన చూసి కామెంటేటర్లు, అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.

