
ఏపీలో ప్రధాన నదుల కాలుష్య నివారణకుపవన్ కళ్యాణ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్
వచ్చే ఏడాది జూన్ నెలలో మొదలయ్యే గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడం కోసం అత్యున్నత స్థాయి ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు పర్యటించిన శ్రీ పవన్ కళ్యాణ్ స్వయంగా పడవపై ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా పవిత్రమైన గోదావరి నదిలో కలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు తాము మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావనతో వెళ్లకూడదు. ప్రతి ఒక్కరికీ పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ నదిలోకి కలిసే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంతోపాటు, శాశ్వత పర్యావరణ రక్షణ చర్యలను పర్యవేక్షించనుంది.

