Find Articles

‘యల్లమ్మ’కు ఓకే చెప్పడానికి అదే కారణం.. డీఎస్పీ స్పెషల్ వీడియో

‘యల్లమ్మ’కు ఓకే చెప్పడానికి అదే కారణం.. డీఎస్పీ స్పెషల్ వీడియో

టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ నటుడిగా పరిచయం కానున్నారనే సంగతి తెలిసిందే. వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ‘యల్లమ్మ’ అనే చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. అయితే, ఒక అగ్ర సంగీత దర్శకుడిగా ఉన్న డీఎస్పీ నటన వైపు ఎందుకు అడుగులు వేశారనే దానిపై స్వయంగా స్పందించారు. తను ఈ సినిమా చేయడానికి వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.

ఈ వీడియోలో తన తండ్రి స్వగ్రామమైన వెదురుపాకలో పర్యటించిన దృశ్యాలను డీఎస్పీ చూపించారు. “చిన్నప్పటి నుంచి జానపద కళల పట్ల ఆసక్తిని నింపిన అద్భుతమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇదే. మా ఊరిలో జరిగే ‘అమ్మోరు జాతర’ వేడుకలు తీవ్ర ప్రభావం చూపాయి. ‘యల్లమ్మ’కు ఓకే చెప్పడానికి ఇదే కారణం” అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. చిన్నప్పుడు చెన్నై నుంచి తరచూ ఈ గ్రామానికి వచ్చేవాళ్లమని, ఇక్కడి ప్రకృతి స్వచ్ఛతను ఆస్వాదించేలా చేశారని గుర్తుచేసుకున్నారు. సంస్కృతి, జానపద కళలు, దైవత్వం వంటి గొప్ప విషయాలను ఈ ఊరే తనకు నేర్పిందని, అదే తనకు స్ఫూర్తినిచ్చింది” అని వీడియోలో తెలిపారు. ఈ అనుబంధం కారణంగానే ‘యల్లమ్మ’ కథకు వెంటనే కనెక్ట్ అయినట్లు వెల్లడించారు.

ఇక ఈ ప్రాజెక్టును దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తుండగా, వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు వేణు, డీఎస్పీ మధ్య తొలి సమావేశం ఏకంగా 8 గంటల పాటు సాగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డీఎస్పీ ‘పర్శి’ అనే పాత్రలో కనిపించనుండగా, సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతుంది.

ManaTV Team