ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్‌పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా మారింది. ఆదివారం రాత్రి ఇంటి ముందు కొందరు వ్యక్తులు వీరంగం సృష్టిస్తుండటాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన విక్రమ్‌పై సుమారు 8 మంది వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల విక్రమ్ సింగ్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన విక్రమ్ సింగ్ ఢిల్లీలో మ్యూజిక్ స్కూల్ నిర్వహిస్తూ విద్యార్థులకు గిటార్‌తో పాటు సంగీతంలో శిక్షణ అందించేవారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, విద్యార్థులు, సంగీతాభిమానుల్లో విషాదం నెలకొంది.