సికింద్రాబాద్ బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్ బెటాలియన్లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ నిమిత్తం వారిని ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.
ఇప్పటికే నలుగురు అగ్నివీర్ గార్డులను విచారించిన అధికారులు.. వారి నుంచి లభించిన సమాచారంతో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కేసు వెలుగులోకి వచ్చిన దాదాపు 10 రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విచారణలో భాగంగా.. రెజిమెంట్ శిక్షణా కేంద్రంలో వినియోగించే కొన్ని ఆయుధాలు, బుల్లెట్లకు ప్రత్యేక కోడింగ్ నంబర్లు లేకపోవడాన్ని నిందితులు గుర్తించినట్లు సమాచారం. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని పక్కా ప్రణాళికతో మూడు నెలల పాటు విడతలవారీగా ఆయుధాలను బయటకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
అత్యాధునిక ఏకే-203, ఇన్సాస్ రైఫిల్స్, పిస్టల్స్ సహా మొత్తం 12 ఆయుధాలను పలు దఫాలుగా బయటకు తరలించినట్లు సమాచారం.
అలాగే ఆయుధాగారం వద్ద రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీ కెమెరాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. డ్యూటీలో ఉన్న గార్డులను వివిధ పనుల పేరుతో అక్కడి నుంచి బయటకు పంపించి.. రెజిమెంట్లో ఏదో హడావుడి జరుగుతున్నట్లుగా పరిస్థితిని సృష్టించి ఆయుధాలను తరలించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో సీనియర్ ఆర్మీ అధికారులు నేరుగా పాల్గొన్నారా? లేక అగ్నివీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి వారి ద్వారా ఆయుధాలను చోరీ చేయించారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.