రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ప్లేగ్ వ్యాధి వ్యాప్తి చెందుతోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇర్కుట్సక్ యాంటీ ప్లేగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన టెక్నీషియన్ దార్య షిపిలోవా.. ప్లేగ్ బాక్టీరియా శాంపిల్స్ ఉన్న టెస్ట్ ట్యూబ్‌ను పొరపాటున పగలగొట్టినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ ఘటన తర్వాత సదరు యువతి ఆదివారం మృతి చెందడంతో ఆందోళనలు మరింత పెరిగాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఆసుపత్రులను క్వారంటైన్ చేసి, సుమారు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం.
అయితే.. ఈ ఘటనపై రష్యా అధికారులు స్పందిస్తూ, యువతి ప్లేగ్ వ్యాధితో మరణించినట్లు నిర్ధారణ కాలేదని తెలిపారు. ఆమె న్యూమోనియాతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ప్లేగ్ వ్యాప్తిపై వస్తున్న వార్తల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్లేగ్ వ్యాప్తి నిర్ధారణ కాలేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు