లండన్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హౌన్స్లోలోని ఫెల్తమ్ అసెంబ్లీ హాల్లో జరిగిన ఈ వేడుకలకు సుమారు 300 కుటుంబాలు హాజరయ్యాయి.
ఈ సందర్భంగా TAL కల్చర్ సెంటర్ విద్యార్థులతో పాటు పలువురు చిన్నారులు శాస్త్రీయ సంగీతం, సంప్రదాయ నృత్యాలు, టాలీవుడ్ పాటలతో ప్రేక్షకులను అలరించారు. చిత్రలేఖన పోటీల్లోనూ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హౌన్స్లో మేయర్ కౌన్సిలర్ రంజిత్ గిల్ చిన్నారులను అభినందించారు. గత 21 ఏళ్లుగా యూకేలో తెలుగు సమాజానికి సేవలందిస్తున్న TAL సంస్థతో పాటు వాలంటీర్ల కృషిని ప్రశంసించారు. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక అవగాహన, ఐక్యతను పెంపొందించడంలో ఇలాంటి సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా యూకే వ్యాప్తంగా 5 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఆన్లైన్ తెలుగు మాట్లాడే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ప్రముఖ సినీ నటుడు గుండు సుదర్శన్, ఫ్రాన్స్‌కు చెందిన తెలుగు భాషా పండితుడు ప్రొఫెసర్ డేనియల్ నెగర్స్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు చిన్నారుల్లోని ప్రతిభను ప్రోత్సహించేలా ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.