
అమెరికాలోని చార్లెట్‌లో ఘనంగా నిర్వహించిన టీటీఏ (తెలుగు టైగర్స్ ఆఫ్ అమెరికా) మెగా కన్వెన్షన్-2026 విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ విజయపాల్ రెడ్డి సంస్థ ప్రయాణం, అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కన్వెన్షన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
వేదికపై మాట్లాడిన విజయపాల్ రెడ్డి.. కన్వెన్షన్‌కు విచ్చేసిన అతిథులతో పాటు, చార్లెట్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అహర్నిశలు శ్రమించిన వాలంటీర్లు, నిర్వహణ సిబ్బంది, ఫుడ్ సర్వీస్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి అంకితభావం, కృషి వల్లే ఈ స్థాయిలో కన్వెన్షన్ విజయవంతమైందని పేర్కొన్నారు.
దాదాపు పదేళ్ల క్రితం చిన్న లక్ష్యంతో ప్రారంభమైన టీటీఏ ప్రయాణం.. నేడు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవలందించే బలమైన జాతీయ సంస్థగా ఎదిగిందని ఆయన అన్నారు. ఈ విజయానికి గత, ప్రస్తుత నాయకత్వంతో పాటు వాలంటీర్ల నిరంతర కృషి, త్యాగమే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికాలోని తెలుగు ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే కాకుండా, స్వదేశంలో కూడా పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం టీటీఏ ప్రధాన లక్ష్యమని విజయపాల్ రెడ్డి తెలిపారు. మెగా కన్వెన్షన్ సంస్థ సాధించిన ప్రగతికి, సభ్యుల ఐక్యతకు, కమ్యూనిటీ విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని ఆయన చెప్పారు.
సంస్థపై నమ్మకం ఉంచి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించిన టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందించిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు.
చివరిగా, వాలంటీర్ల సేవలకు వెన్నుదన్నుగా నిలిచిన వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళలకు విజయపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా టీటీఏ మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

