Find Articles

క్రీడాలోకానికి షాక్.. భారత దిగ్గజ షూటర్‌ జస్పాల్‌ రాణా కన్నుమూత

క్రీడాలోకానికి షాక్.. భారత దిగ్గజ షూటర్‌ జస్పాల్‌ రాణా కన్నుమూత

భారత దిగ్గజ షూటర్‌, ప్రముఖ కోచ్‌ జస్పాల్‌ రాణా (49) కన్నుమూశారు. ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌ నుంచి భారత్‌కు తిరిగొస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం జస్పాల్‌ రాణా భారత పిస్టల్‌ షూటింగ్‌ జట్టుకు హై-పర్ఫార్మెన్స్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, జస్పాల్‌ రాణా ప్లేయర్ గానూ అత్యంత విజయవంతమైన కెరీర్‌ను సొంతం చేసుకున్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో నాలుగు ఎడిషన్లలో పాల్గొని, మొత్తం 15 పతకాలు సాధించారు. వీటిలో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. అంతేకాదు ఆసియా క్రీడల్లో ఏకంగా 8 పతకాలు గెలుపొందారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 1994లో అర్జున అవార్డు, 1997లో పద్మశ్రీ పురస్కారం లభించాయి. కోచ్‌గా చేసిన సేవలకుగానూ 2020లో దేశ అత్యున్నత కోచింగ్‌ పురస్కారం ద్రోణాచార్య అవార్డును సైతం అందుకున్నారు.

షూటర్‌గా విజయవంతమైన ప్రయాణం చేసిన జస్పాల్ రాణా తరువాత కోచ్‌గా మారారు. భారత షూటింగ్‌కు కొత్త తరం ఛాంపియన్లను అందించారు. మరీ ముఖ్యంగా ఒలింపిక్‌ డబుల్‌ మెడలిస్ట్‌ మను భాకర్‌తో పాటు పలువురు భారత షూటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జస్పాల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ManaTV Team