
ఐపీఎల్ 2026 సీజన్‌లో కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ బెర్త్ కోసం న్యూ చండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే చండీగఢ్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య చండీగఢ్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం పూట వాతావరణం నిర్మలంగా ఉన్నప్పటికీ, సమీపంలోని హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న టీమ్ ఫైనల్‌కు వెళ్తుంది. ఈ లెక్కన పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

