
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మూవీ యూనిట్ కు, పంపిణీదారులకు భారీ ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి, ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
జూన్ 4న సినిమా విడుదల కానుండగా, జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పెద్ది’ స్పెషల్ ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవచ్చు. ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను జీఎస్‌టీతో కలిపి రూ. 600గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కొన్ని భారీ చిత్రాల ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు వెయ్యి రూపాయలకు పైగా పలకగా.. ‘పెద్ది’కి రూ. 600 ధరను నిర్ణయించడంపై సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైన తొలి వారం రోజుల పాటు అంటే జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 అదనంగా వసూలు చేసుకునే అవకాశం ఇచ్చింది. దీంతో పాటు థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

