Find Articles

అమెరికాలో తెలుగు వైభవానికి ప్రతీకగా 19వ ఆటా మహాసభలు: శరత్ వేముల

అమెరికాలో తెలుగు వైభవానికి ప్రతీకగా 19వ ఆటా మహాసభలు: శరత్ వేముల

అమెరికాలో 35 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో 19వ ఆటా మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు నేషనల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించడం తనకు దక్కిన అరుదైన గౌరవమని, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు శరత్ వేముల తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలు కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే మహోత్సవమని ఆయన పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్న “దేశభాషలందు తెలుగు లెస్స” అనే సూక్తిని గుర్తు చేస్తూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి తెలుగు వారి బాధ్యత అని అన్నారు. ఈ మహాసభల నిర్వహణ కోసం కోర్ టీమ్ గత కొన్ని నెలలుగా అహర్నిశలు శ్రమించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని తెలిపారు. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కెనడా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల నుంచి సుమారు 12 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సాహితీవేత్తలతో పాటు మేరీల్యాండ్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్, బాల్టిమోర్ మేయర్ కూడా ఈ మహాసభల్లో పాల్గొననున్నట్లు శరత్ వేముల తెలిపారు.

మహాసభల్లో పూర్వ విద్యార్థుల సమావేశాలు, “జుమ్మంది నాదం – సయ్యంది పాదం” పేరుతో నృత్య, సంగీత ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు, ఉమెన్స్ ఫోరం, బిజినెస్ ఫోరం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఈ వేడుకల్లో పాల్గొని 19వ ఆటా మహాసభలను విజయవంతం చేయాలని శరత్ వేముల పిలుపునిచ్చారు.

ManaTV Team