Find Articles

ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌.. టికెట్ల దోపిడీ!

ఈ నెల 22న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల ధరల విక్రయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. నగరంలో ఈ సీజన్‌కు ఇదే చివరి మ్యాచ్ కావడం, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ పూర్తిగా క్యాష్ చేసుకుంటోంది. హైదరాబాద్ పేరు వాడుకుంటూ స్థానిక ఆటగాళ్లకు అసలు అవకాశం ఇవ్వని యాజమాన్యం, ఇక్కడి అభిమానుల క్రికెట్ పిచ్చిని మాత్రం వ్యాపారంగా మార్చుకుంటూ టికెట్ ధరలను దాదాపు రెట్టింపు చేసింది. గత మ్యాచ్‌లలో రూ. 950 గా ఉన్న కనీస టికెట్ ధరను ఏకంగా రూ. 1,950 కి పెంచడంతో పాటు, సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను రూ. 30 వేల నుండి ఒకేసారి రూ. 45 వేలకు పెంచి సామాన్య క్రికెట్ ప్రేమికులకు మ్యాచ్‌ను దూరం చేసింది.

ధరల పెంపు ఒకెత్తయితే, జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో జరిగిన ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం సాయంత్రం టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన కేవలం నిమిషాల వ్యవధిలోనే ‘సోల్డ్ అవుట్’ బోర్డు ప్రత్యక్షం కావడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఉప్పల్ స్టేడియం మొత్తం సామర్థ్యం 39 వేల సీట్లు కాగా, ఉచిత కాంప్లిమెంటరీ పాసులు పోను సుమారు 30 నుండి 32 వేల టికెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అయితే, ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభం కాగానే దాదాపు 3 లక్షల మందిని క్యూలో చూపించి, కంటికి కనిపించకుండానే వేలాది టికెట్లు మాయం కావడం వెనుక పెద్ద దందా నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్యాన్స్‌ను బురిడీ కొట్టించి తెరవెనుక టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారని, ఇప్పటివరకు అసలు ఎన్ని టికెట్లు అమ్మారనే వివరాలను సన్‌రైజర్స్ యాజమాన్యం దాచడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *