తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం సాధించి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన టీవీకే పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ తన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్దేశిత సమయానికి పావుగంట ముందే రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచి స్వయంగా లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు భోజన విరామ సమయంలోనూ తన ఛాంబర్‌కే పరిమితమవుతున్న విజయ్, భోజనం ముగించి వెంటనే తిరిగి పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ కొత్త పనితీరు సచివాలయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తమిళనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు ‘తమిళగ వెట్రి కళగం’ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా విజయ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంలోనే వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా విజయ్ పనితీరు, నిబద్ధత అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని తెలుస్తోంది.