
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో మైదానంలో ఘర్షణకు దిగిన శ్రీలంక ‘ఏ’ ప్లేయర్ విషెన్ హలంబగేపై ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కఠిన చర్యలు తీసుకుందని తెలుస్తోంది. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ అందించిన అంపైర్ల నివేదిక ఆధారంగా ఆయనకు భారీ జరిమానా విధించినట్లు సమాచారం.
సాధారణంగా ఐసీసీ తరహాలో ఎలాంటి అధికారిక విచారణలు నిర్వహించకుండానే లంక బోర్డు నేరుగా ఈ శిక్ష ఖరారు చేయడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, రీసెంట్ గా భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ టై అవ్వడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమైన దశలో వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉన్నారు. కానీ ఆ తీవ్రమైన ఒత్తిడి కారణంగా వైభవ్ జట్టును గెలిపించలేకపోయారు.. భారత్ ఓటమి పాలవడంతో లంక ఆటగాళ్లు హద్దులు దాటి ప్రవర్తించారని తెలుస్తోంది.
నిరాశతో పెవిలియన్ వైపు నడుస్తున్న వైభవ్ టార్గెట్ గా శ్రీలంక ప్లేయర్లు అవహేళన చేశారు. దాంతో భారత ప్లేయర్ సూర్యాంశ్ షెడ్గే వారిని నిలదీశారు. ఆ తరువాత వైభవ్ కూడా ముందుకు రావడంతో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే శ్రీలంక ‘ఏ’ ప్లేయర్ విషెన్ హలంబగేకు ఆ దేశ బోర్డు భారీ జరిమానా విధించిందని సమాచారం. ఈ విషయాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన బీసీసీఐ వైభవ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

