
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన ఆయన, ఆగస్టు 16న జరగనున్న వివాహానికి హాజరుకావాలని కోరుతూ వివాహ పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి ఆశీస్సులు పొందిన బండ్ల గణేశ్ తన ఆనందాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. “నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అన్నయ్య చిరంజీవి గారి ఆశీస్సులు లభించడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ భావోద్వేగంగా పోస్టు చేశారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ #JananiSuryaPayanam హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరితో జరగనుంది. ఆగస్టు 16న ఉదయం 11:58 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఇప్పటికే జరిగిన నిశ్చితార్థం, పసుపు-కుంకుమ కార్యక్రమాలకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు కూడా సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

