
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ అందింది.. దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘మందాకిని’ అనే పాత్రలో ప్రియాంక చోప్రా ఫెరోషియస్ అవతార్‌లో కనిపించగా.. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ‘వీక్లీ’ ఈ ఫొటోలను ప్రత్యేకంగా పంచుకోగా.. ప్రియాంక కంప్లీట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో, ఉంగరాల జుట్టుతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఇక చిత్రంలో ఆమె పోషిస్తున్న ‘మందాకిని’ పాత్రను “ప్రపంచవ్యాప్తంగా పర్యటించే ఒక ధైర్యవంతురాలు, శక్తిమంతమైన మహిళ. అదే సమయంలో సున్నితమైన భావోద్వేగాలు కలిగి, ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోయే పాత్ర” అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్నారు. మహేశ్ ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు రామాయణ యుద్ధ ఘట్టాలకు సంబంధించిన 20 నిమిషాల సన్నివేశంలో శ్రీరాముడి పాత్రలో కూడా మహేశ్ బాబు కనిపించనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేసే అవకాశం ఉంది.

