
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ (89) బార్బడోస్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో క్రీడాలోకమంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ సహా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు కన్నీటి నివాళులు అర్పించారు.
సర్ గ్యారీ సోబర్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సచిన్ టెండూల్కర్ ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. “సర్ గ్యారీ ఇక లేరనే వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆయనతో గడిపిన ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. 2003 ప్రపంచకప్‌లో నా చేతికి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ ట్రోఫీని అందించింది ఆయనే. నేను 100వ అంతర్జాతీయ శతకం పూర్తి చేసినప్పుడు నన్ను అభినందించిన తీరు మరువలేనిది. ఆయనెప్పుడూ ఎంతో సౌమ్యంగా ఉండేవారు. కొన్నేళ్ల క్రితం లండన్‌లో మేమిద్దరం కలిసి ఆట గురించి మాట్లాడుకున్నాం. అదే మా చివరి సమావేశం అవుతుందని ఊహించలేకపోయాను. ఆయనే అసలైన ‘వన్ అండ్ ఓన్లీ’. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం సర్ గ్యారీ. మీ ఆత్మకు శాంతి చేకూరాలి” అని పేర్కొ్న్నారు..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సోబర్స్‌కు నివాళులర్పించారు.. “క్రికెట్ ప్రపంచం తన గొప్ప వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ఆత్మకు శాంతి చేకూరాలి. మీ వారసత్వం రాబోయే తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అని పేర్కొన్నారు..
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన సోబర్స్.. తన అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఆటకు కొత్త నిర్వచనం ఇచ్చారు. టెస్ట్ క్రికెట్‌లో అప్పట్లో ప్రపంచ రికార్డుగా నిలిచిన 365 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడారు. అంతేకాదు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది.

