Find Articles

అమెరికాలో తెలుగు సంస్కృతి సందడి.. టీటీఏ మెగా కన్వెన్షన్-2026 ఘనంగా ప్రారంభం

అమెరికాలో తెలుగు సంస్కృతి సందడి.. టీటీఏ మెగా కన్వెన్షన్-2026 ఘనంగా ప్రారంభం

అమెరికాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి వేదికగా మారింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీటీఏ మెగా కన్వెన్షన్-2026 తొలి రోజు వేడుకలు కళాత్మక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందేశాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహాసభకు అమెరికాతో పాటు పలు దేశాల నుంచి తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమం ప్రారంభంలో అతిథులకు టీటీఏ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. చార్లెట్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు డింపుల్ అజ్మీరా, మేయర్ హరింగ్టన్‌తో పాటు టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కన్వెన్షన్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన విజయపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, భరత్ రెడ్డి, వంశీ రెడ్డి తదితరులను సంస్థ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది ప్రత్యేకంగా అభినందించారు.

తొలి రోజు నిర్వహించిన ‘జానపదాల జాతర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రసమయి బాలకిషన్, వందేమాతరం శ్రీనివాస్, నర్సిరెడ్డి కాసాలా, సంధ్య, నల్గొండ గద్దర్, కాసర్ల శ్యామ్ తమ గాన, సాహిత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. తెలంగాణ జానపద గీతాలతో సభా ప్రాంగణం కళకళలాడింది.

ఈ సందర్భంగా వైద్యం, జర్నలిజం, ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంస్కృతికం, సాహిత్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులను టీటీఏ ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో సత్కరించింది. వారి సేవలను కొనియాడుతూ సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ భాష, సంస్కృతిని కాపాడుతూ భావితరాలకు అందించడం గర్వకారణమన్నారు. భారత అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర మరింత కీలకంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

టీటీఏ సావనీర్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. యాంకర్ సుమ కనకాల వేదికపై చేసిన సరదా వ్యాఖ్యలు సభికులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం, ప్రముఖుల ప్రసంగాలతో తొలి రోజు వేడుకలు విజయవంతంగా ముగియగా, మిగిలిన రెండు రోజుల కార్యక్రమాలపై కూడా పాల్గొనేవారిలో ఆసక్తి నెలకొంది.

ManaTV Team