Find Articles

‘రైతు గోస – బీజేపీ భరోసా’.. ఐకేపీ కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక రైతుల ఆందోళన

‘రైతు గోస – బీజేపీ భరోసా’.. ఐకేపీ కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక రైతుల ఆందోళన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునే క్రమంలో భాగంగా, నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పీఏసీ సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి “రైతు గోస – బీజేపీ భరోసా” పేరుతో రాష్ట్రవ్యాప్త యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని కులకచర్లలో ప్రారంభమైన ఈ యాత్ర, నేడు నిర్మల్ జిల్లా సారంగపూర్ లో బిజెఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా వరి సాగులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం, ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. వ్యవసాయ శాఖ నుండి ధాన్యం ఉత్పత్తి అంచనాలపై నివేదికలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఐకేపీ కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం గన్నీ బ్యాగులు, రవాణా, హమాలీ చార్జీలకు కావలసిన నిధులు సమకూరుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులపై భారాన్ని నెడుతోందని మండిపడ్డారు.

ManaTV Team