Find Articles

ఆరుట్లలో ప్రపంచ స్థాయి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

ఆరుట్లలో ప్రపంచ స్థాయి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

ప్రభుత్వ పాఠశాలలంటే అనాధలు, ఆర్థికంగా చితికిపోయిన వారు చదువుకుంటారన్న అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిలషించారు. కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే సందర్భంగా విద్యార్థులకు ఉదయం అందించే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.

✅ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు ఆరుట్ల పబ్లిక్ స్కూల్ స్ఫూర్తిగా నిలుస్తుందంటూ, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్‌మెంట్ కమిటీకి అభినందనలు తెలిపారు.

✅ “ప్రభుత్వ పాఠశాల అనగానే తక్కువగా భావించే విధంగా అందరి మదిలో నెలకొన్న అనుమానం, అపనమ్మకాలను పోగొట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విధంగా కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణించగలరన్న ఒక బృహత్తర సంకల్పంతో ఈ పాఠశాలను తీర్చిదిద్దాం. ఆరుట్ల పాఠశాల తెలంగాణకు ఒక రోల్ మోడల్ గా, స్ఫూర్తిదాయకంగా నిలవాలి” అని అన్నారు.

✅ “విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించే విధంగా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా. ఈ స్కూల్ రోల్ మోడల్ గా ఎలా నిలుస్తుందో ఎవరొచ్చినా చూపించాలి. ఈ అద్భుతమైన కార్యానికి ప్రజలు సంపూర్ణంగా అండదండలు అందించాలి” అని ముఖ్యమంత్రి కోరారు.

 

ManaTV Team