
తమిళనాడు సీఎం విజయ్ నటించిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్’. ఈ సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. జులై 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. విదేశాల్లో మాత్రం జులై 24 నుంచి ప్రదర్శించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జులై 9న సర్టిఫికేషన్ పూర్తికాగా, సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాల 11 సెకన్లుగా నమోదైంది. విడుదలకు ముందు చిత్రంలో 12 మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించగా, ఆ మార్పులు చేసిన తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

