Find Articles

ATA : అదరహో ఆటా.. బాల్టిమోర్ కాన్ఫరెన్స్ కి భారీ ఏర్పాట్లు!

ATA : అదరహో ఆటా..  బాల్టిమోర్ కాన్ఫరెన్స్ కి భారీ ఏర్పాట్లు!

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌కు ముస్తాబవుతోంది. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని ఆటా కార్యవర్గం వెల్లడించింది.

వేలాది మంది ప్రవాస తెలుగు ప్రజలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వైద్య నిపుణులు, యువత, కళాకారులు పాల్గొననున్న ఈ మహాసభలను చిరస్మరణీయంగా నిర్వహించేందుకు దాదాపు 70 కమిటీలు, వందలాది మంది వాలంటీర్లు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

1991లో స్థాపించబడిన ఆటా సంస్థ 35 ఏళ్లుగా ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలకు సాంస్కృతిక, సామాజిక, విద్యా, వైద్య, సేవా కార్యక్రమాల ద్వారా విశేష సేవలందిస్తోంది. ఆటా ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో కూడా విద్య, వైద్యం, వరదలు, కోవిడ్ వంటి విపత్తుల సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది.

ఈ ఏడాది కాన్ఫరెన్స్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బిజినెస్, మెడికల్, అలుమ్ని, లిటరరీ, యూత్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, స్టార్టప్ వ్యవస్థాపకుల కోసం B2B మ్యాచ్‌మేకింగ్, ఎగ్జిక్యూటివ్ నెట్‌వర్కింగ్ సెషన్లు, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఫోరం, ఐడియా బజ్ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ పరిశోధన వంటి కీలక అంశాలపై ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొనే CME కాన్ఫరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.


ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే ఫ్యాషన్ షో, నిరావాల్ బ్యాండ్ లైవ్ కాన్సర్ట్, ATA బ్యూటీ పేజెంట్, యూత్ ఫ్యాషన్ షో, అష్టావధానం, సాహిత్య సదస్సులు, యూత్ క్రూయిజ్, ATA మ్యాట్రిమోనీ వంటి కార్యక్రమాలు సందర్శకులను అలరించనున్నాయి.

అమెరికాలో జన్మించిన యువతతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వచ్చిన తెలుగు యువతకు ATA మ్యాట్రిమోనీ ద్వారా వివాహ పరిచయ వేదికను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
కాన్ఫరెన్స్ వేదికలో మినీ షాపింగ్ మాల్‌ను తలపించేలా వివిధ వెండర్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్, విద్యా సంస్థలు, ఆరోగ్య అవగాహన, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన స్టాళ్లు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆటా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలందరూ ఈ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల మాట్లాడుతూ మూడు రోజుల పాటు అన్ని వయసుల వారిని ఆకట్టుకునే విభిన్న కార్యక్రమాలను రూపొందించామని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.

admin