
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల తన మూడో సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ‘బబుల్‌గమ్’, ‘మోగ్లి’ చిత్రాలతో హీరోగా పరిచయమైన ఆయనకు ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో, మూడో సినిమా కోసం రోషన్ ఒక వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు విఐ ఆనంద్ కథ అందించడంతో పాటు సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. విజయ్ కె. కమ్మిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా… బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు పనిచేసిన దిగ్గజ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ పనిచేస్తుండటం విశేషం.
సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ అంశాలతో భారీ బడ్జెట్, ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రాబోతుందని తెలుస్తోంది. ఇందులో రోషన్ సరసన గహజీ షిజు కున్నత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య, సుదర్శన్, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

