
తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ శుక్రవారం (జూలై 10, 2026) కరూర్ నగరంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు రోడ్ల వెంట నిలబడి సీఎం విజయ్‌కు అభివాదం చేస్తూ తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ప్రజలను ఉద్దేశించి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కరూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ పాల్గొన్నారు. 2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన ప్రజాసభ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన కారుణ్య నియామకాలలో భాగంగా, 31 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైన ప్రతి కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

