ప్రదేశం ఏదైనా సరే, ఐకానిక్ మార్కెట్లలో షాపింగ్ చేయడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, శారీరకంగా అంతటి అలసటను కలిగిస్తుంది. ఈ కష్టాలన్నింటికీ చెక్ పడింది. సరికొత్త స్టార్టప్ రంగంలోకి దిగింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో క్యారీమెన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
“మీరు షాపింగ్ చేయండి.. మీ లగేజ్ మేము మోస్తాము” అనే నినాదంతో ఈ సరికొత్త సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన ఇద్దరు స్థానిక యువకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మార్కెట్లకు వెళ్లినప్పుడు అనుభవించిన కష్టాల నుండే ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. అయితే ఈ సర్వీస్ ను పొందడానికి గంటకు 149 రూపాయల చొప్పున చెల్లించాలి. ఒక శిక్షణ పొందిన అసిస్టెంట్ (సహాయకుడు) మార్కెట్ అంతా మీ వెంటే ఉంటాడు. కస్టమర్ల సౌకర్యార్థం 2, 3 లేదా 4 గంటల ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అసిస్టెంట్ కేవలం షాపింగ్ బ్యాగులు మోయడమే కాకుండా, మార్కెట్ సందులలో దారి చూపించడం, ఫుడ్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, షాపింగ్ ముగిసిన తర్వాత మెట్రో గేట్లు లేదా పార్కింగ్ ఏరియా వరకు లగేజ్ తీసుకురావడం వంటి పనులన్నీ చేస్తారు. దీనివల్ల కస్టమర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు.
అంతేకాదు ఎండ, వానల నుండి రక్షణకు గొడుగులు, మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు, నీళ్ల సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. అయితే, ఒక అసిస్టెంట్ గరిష్టంగా 12 కిలోల వరకు మాత్రమే బరువు మోయగలడు. అంతకంటే ఎక్కువ బరువు ఉంటే మరొక అసిస్టెంట్‌ను హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ లాజ్‌పత్ నగర్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది.