అమెరికా ఆంక్షలు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు యథాతధంగా కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. దేశీయ ఇంధన అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు దిగుమతులు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ కీలక ప్రకటన చేశారు.
అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసిందని సుజాత శర్మ తెలిపారు. అలాగే ఆంక్షలను సడలించినప్పుడూ చమురు దిగుమతి చేసుకున్నామని అన్నారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆ కొనుగోళ్లు కొనసాగుతాయని, చమురు ఏ దేశం నుంచి కొనాలనేది పూర్తిగా వాణిజ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందువల్ల అమెరికా ఆంక్షల సడలింపు ఉన్నా లేకపోయినా మనకు ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా దేశంలో చమురు కొరత లేదని తెలిపారు.
ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలకు అనుమతిస్తూ అమెరికా ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరపాలని గతంలో తెలిపింది. ఆ గడువు ఈ నెల 17తో ముగిసిన నేపథ్యంలో దేశంలో చమురు కొరతపై మరోసారి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించింది.