
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన అద్భుత ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. తనదైన శైలి, చమత్కారమైన కామెడీ టైమింగ్, విభిన్న గొంతుల అనుకరణతో సభలో నవ్వుల పువ్వులు పూయించారు.
కార్యక్రమాన్ని గానకోకిల ఎస్. జానకి గారి స్వరాన్ని అద్భుతంగా అనుకరిస్తూ పాటతో ప్రారంభించిన శివారెడ్డి, ఆ తర్వాత ప్రముఖ గాయకులు ఘంటసాల, కే.జే. జేసుదాస్, రమణ గోగుల, జెస్సీ గిఫ్ట్ తదితరుల గొంతులను అనుకరిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా ప్రజాకవి గద్దర్ గారి శైలిలో ఆలపించిన పాటలు సభలో విశేష ఆదరణ పొందాయి.
గాయకులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు వి. హనుమంతరావు, కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), నారా చంద్రబాబు నాయుడు, డా. వైఎస్ రాజశేఖర రెడ్డిల మాట్లాడే తీరును అద్భుతంగా అనుకరించి ప్రేక్షకుల నుంచి ఘనమైన చప్పట్లను అందుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ శైలిలో చేసిన మిమిక్రీ కూడా సభికులను విశేషంగా ఆకట్టుకుంది.
విభిన్న స్వరాలు, హాస్యభరితమైన ప్రదర్శనలు, చమత్కారమైన వ్యాఖ్యలతో సాగిన శివారెడ్డి మిమిక్రీ మెడ్లీ టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం ముగింపులో టీటీఏ నిర్వాహకులు శివారెడ్డిని ఘనంగా సత్కరించి, ఆయన కళా ప్రతిభను కొనియాడారు.
ఈ ప్రదర్శన కన్వెన్షన్‌కు హాజరైన తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయమైన వినోదాన్ని అందించడంతో పాటు కార్యక్రమ విజయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

