అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఓక్ ట్రీ రోడ్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ సంబరాల్లో స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
బాలీవుడ్ సంగీతం, భాంగ్రా నృత్యాలు, షాపింగ్ స్టాళ్లు, రుచికరమైన సంప్రదాయ వంటకాలు, ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీతం, నృత్యాలతో ఓక్ ట్రీ రోడ్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రామాయణం డ్యాన్స్ డ్రామా. పండిట్ ఎస్.ఎన్. చర్కా దర్శకత్వం, నృత్య రూపకల్పనలో 30 మందికి పైగా నృత్యకారులు, కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. రామాయణంలోని ఘట్టాలను నృత్యరూపంలో అద్భుతంగా ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రాజ్ జ్యువెలర్స్ మద్దతుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కుల్రాజ్ ఆనంద్, తన్వి ప్రణీత చంద్ర సమన్వయం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు తమ ప్రతిభతో వేడుకలకు మరింత కళ తీసుకొచ్చారు.
ఈ దీపావళి సంబరాలకు సుమారు 500 మంది హాజరయ్యారు. స్వీట్లు, సంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా ఈ వేడుకలు నిలిచాయి.